2013-07-20

జన్మ నక్షత్రము – జనన దోషములు 1 – 9



పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రము మంచిదేనా ? దోషములేమైనా ఉన్నాయా ? శాంతి అవసరమా ? అను సందేహము ప్రతి తల్లిదండ్రులకు కలుగుతుంది . ఏ నక్షత్రములలో జన్మించినపుడు ఏ దోషములు కలుగు తాయి దోష పరిహారములు ఏమిటి ? అను విషయమును గురించి ఈ శీర్షికలో తెలుసు కుందాం .
దోష నక్షత్రములలో జన్మించిన పిల్లలకు నక్షత్ర జపము , నవ గ్రహ శాంతి ,హోమము , నూనెలో నీడలు చూచుట , రుద్రాభిషెకము, మొదలగు శాంతిని తప్పని సరిగా జరిపించాలి . కొన్ని విశేష శాంతి కలిగిన నక్షత్రములకు శాస్త్రోక్తముగా విశేష శాంతి చేయాలి . 
1.       అశ్విని 1 వ పాదములో జన్మంచిన పిల్లల వలన తండ్రికి గండము . ఈ దోషము ౩ నెలలు ఉండును. బంగారము దానము చెయ్యడము వలన నివృత్తి కలుగును . ఇక్కడ గమనించ వలసిన విషయము రేవతి , అశ్విని నక్షత్రముల మధ్య సుమారు 48 నిమిషములు సంధి కాలము ఉంటుంది . ఈ సంధి సమయములో జన్మించిన శిశువుకు ఆయుర్దాయము తక్కువగా ఉంటుంది . అశ్విని 2 ౩ 4 పాదములలో జన్మించిన వారికి దోషములేదు .
2.       భరణీ 1 2 4 పాదములలో జన్మంచిన వారికి దోషములేదు . ౩ వ పాదములో ఆడపిల్ల పుడితే తల్లికి , మగపిల్ల పుడితే తండ్రికి గండము కలుగును . ఈ దోషము 23 దినముల వరకు ఉంటుంది .
3.       కృత్తిక నక్షత్రములో ౩ వ పాదము లో జన్మంచిన స్త్రీ తల్లికి పురుషుడు తండ్రికి అరిష్టమును కలుగ చేయును . 1 2 4 పాదములలో జన్మంచిన వారు స్వల్ప దోషమును కలుగ చేయుదురు .
4.       రోహిణి నక్షత్రము 1 వ పాదములో జన్మించిన మేనమామకు , 2 వ పాదము తండ్రికి , ౩వ పాదము తల్లికి దోషమని 4 వ పాదము దోషము లేదని కొందరి అభిప్రాయము . సామాన్యముగా ఈ నక్షత్రములో పుట్టిన వలన మేనమామ కు గండము. తప్పక శాంతి అవసరము . శ్రీ కృష్ణ పరమాత్ముడు ఈ నక్షత్రము నందే జన్మించాడు. మేనమామ గండములో పుట్టాడు .  అందు వలెనే కంసుడు నాశనమయ్యాడనీ పురాణ వచనము .
5.       మృగశిర 1 2 ౩ 4 పాదములలో జన్మించిన వారికి ఏ విధమైన దోషములు ఉండవు .
6.       ఆరుద్ర నక్షత్రము 1 2 ౩ పాదము లలో జన్మంచిన వారికి దోషము లేదు 4 వ పాదమున జననము జరిగిన సామాన్య శాంతి అవసరము
7.       పునర్వసు నక్షత్రము 1 2 ౩ 4  పాదములు అన్నీ మంచివే . ఏ విధమైన శాంతి అవసరము లేదు .
8.       పుష్యమి నక్షత్రము కర్కాటక లగ్నములో పగటి సమయమున పురుషుడు పుట్టిన తండ్రికి గండము కలుగును . రాత్రి సమయాన స్త్రీ జన్మించినచో తల్లికి గండము కలుగును.   పుష్యమి నక్షత్రము లో జన్మించిన వారివలన 1 వ పాదము మేనమామలకు 2 ౩ పాదములలో తల్లి తండ్రులకు దోషము కలిగింతురు . నాలగవ పాదమున పుట్టిన వారికి సామాన్య దోషము కలుగును . వీరికి శాస్త్రోక్తముగా శాంతిని చేయించాలి . గంధపు చెక్కను దానము ఇచ్చుట వలన దోషము నశించును .
9.       ఆశ్లేష నక్షత్రములో 1 వ పాదమున  పుట్టినవారికి  దోషము లేదు.  2 వ పాదము శిశువునకు ౩ వ పాదము తల్లికి 4 వ పాదము తండ్రికి దోషము . నాలుగవ పాదము న జన్మించిన వారికి విశేష శాంతి చేయించుట అవసరము. ఈ నక్షత్రము యొక్క చివరన 24 నిమిషములు సంధి ఉండును . ఈ సంధి కాలమున జన్మించిన శిశువునకు పూర్ణాయుర్ధాయము ఉండదు .
మిగతా నక్షత్రముల గురించి తదుపరి శీర్షికలో తెలుసుకుందాం .  
 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...