2013-07-26

గోచారము – గురుడు


గోచారములో గురుడు పన్నెండు రాశులలో  సంచరించునపుడు కలుగు ఫలితములు

శ్లోకం :   రాజకోపో యశోహానీ రుద్యోగస్య విరోధకం
          బుద్ధిభ్రంశో భాగ్యహాని ర్భయంతను గతే గురౌ
జన్మ రాశిలో గురుడు సంచరించు నపుడు ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుదురు . పేరు ప్రఖ్యాతలకు నష్టము కలుగును . చేయు వృత్తి , వ్యాపారములలో ఇబ్బందులు ఎదురగును . బుద్ది గతి తప్పును . సంపద నశించును . భయముగా ఉండును .

శ్లోకం :   మనస్సౌఖ్యం యశోవృద్ధి స్సౌభాగ్యంచ ధనాగమః
          ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్తానగేగురౌ
రెండవ రాశిలో గురు సంచార వేళలో మనస్సున సౌఖ్యము కలుగును , గృహమునందు శుభ కార్యములు జరుగును . కీర్తి ప్రతిష్టలు పెరుగును . ధన రాబడి బాగుంటుంది . తీర్ధ యాత్రలు చేయడము , ధర్మ బద్దమైన కార్య క్రమములలో పాల్గొనడము జరుగుతుంది . సంతోషముగా ఉంటుంది . కుటుంబ సౌఖ్యము కలుగును .

శ్లోకం :   అతిక్లేశం బంధువైరం దారిద్యం దేహపీడనం
          ఉద్యోగ భంగం కలహం తృతీయ స్తానగే గురు:
మూడవ రాశిలో గురుడు సంచారము చేయు చున్నప్పుడు శారీరక శ్రమ అధికము గా ఉంటుంది . చుట్టములతో విరోధము ఏర్పడుతుంది .దరిద్రమును అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారములలో నష్టములు కలుగుతాయి . శరీరమునందు భాధలు , అనవసరమైన తగవులు ఏర్పడతాయి .

శ్లోకం :   యాచనం బుద్ది చాంచల్యం తేజో హానీం ధన వ్యయం
          దేశ త్యాగంచ కలహం చతుర్ధ స్తానగే గురు:
నాలుగవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు దీన స్థితి కలుగుతుంది . బుద్ది చంచలముగా ఉండును. మర్యాద నశించును . ధన నష్టము కలుగును గొడవలు పెరుగుతాయి . స్థాన నాశనము కలుగుతుంది


శ్లోకం :   అర్ధ లాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం
          సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భావే ద్గురౌ
అయిదవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు ధన లాభము కల్గుతుంది . స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించుటయే కాక విజయము లభించును తన కుటుంబ మరియు బంధు వర్గముల వలన సౌఖ్యమును అనుభవిస్తారు .

శ్లోకం :   దారాపుత్ర విరోధశ్చ స్వజనై కలహస్తదా
          చోరాగ్ని నృప భీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ
బృహస్పతి ఆరవ రాశి సంచారము లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ , పిల్లలతోనూ విరోధము ఏర్పడును . అసహనము కలుగును , దొంగల వలన నష్టము ఏర్పడును . అగ్ని భయము కలుగును . ప్రభుత్వ సంభందిత వ్యవహారములలో ఇబ్బందులు కలుగును .

శ్లోకం :   రాజ దర్శన మారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం
          అభీష్ట కార్య సిద్దిశ్చ సప్తమస్తే భవేద్గురౌ
ఏడవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు మంచి ఆరోగ్యముగా ఉంటారు . ప్రభుత్వ పరిపాలకుల తో పరిచయములు ఏర్పడతాయి . తలచిన కార్యములు నెరవేరుతాయి . ప్రతి పని తనకు అనుకూలముగా జరుగుతుంది .

శ్లోకం :   చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం
          నిష్టురం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్
ఎనిమిదవ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు దొంగల వలన గానీ , అగ్ని వలన గానీ , నష్టము ఏర్పడును , శరీర సౌఖ్యము ఉండదు . నిస్టూరముగా మాట లాడడం , ప్రతి పనిలోనూ తెగింపు , కోపము ఎక్కువగా ఉండడము జరుగుతుంది .

శ్లోకం :   అర్ధంచ స్వకులాచారః గృహలాభః సుభోజనం
          నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేత్ గురౌ
తొమ్మిదవ రాశిలో గురుని సంచారము ఉన్నప్పుడు సునాయాస ధన లాభము కలుగును . మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడచుకొంటారు. గృహము నిర్మించుకొంటారు . ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉంటారు . భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది .

శ్లోకం :   ధాన్య నాశో ధనచ్చేదః వృధా సంచరణం భయం
          స్వజనై దూషనః చైవ దశమష్తో యదా గురు:
బృహస్పతి పదవ రాశిలో సంచరించు చున్నప్పుడు ధనమునకు నాశనము కలుగును , అనవసర ఖర్చులు పెరుగుతాయి . బ్రతుకు భయముగా సాగుతుంది . ఇతరులచే దూషించ బడతారు .

శ్లోకం :   యశో వృద్ధి బలం తేజ స్సర్వత్ర విజయ స్సుఖం
          శత్రు నాశో మంత్రం సిద్ధి రేకాదశ గతే గురౌ
పదకొండవ రాశి లో గురుడు సంచారము  చేయుచున్నప్పుడు మంచి పేరును సంపాదిస్తారు . తేజస్సు , పలుకుబడి పెరుగుతుంది . శత్రువులు నాశనమవుతారు ,అన్నివిధాలా లాభమును పొందుతారు .

శ్లోకం :   శుభ మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం
          స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్తానగే గురౌ
పన్నెండవ రాశిలో గురుడు సంచారము జరిగేటప్పుడు ఇంటిలో శుభ కార్యములు జరుపుట వలన ధనము ఖర్చగును . ఆస్తులను అమ్ముకొంటారు . దరిద్రమును అనుభవించుట , స్థానమును మారుట మొదలగు ఫలితములను కలుగచేయును.  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...