2013-06-30

శుక్రాచార్యుడు ..2



ఈ విధంగా కచుడు శుక్రాచార్యుని వద్ద శిష్యుడుగా చేరాడు .
గురువుగారికి కావలసిన సకల సేవలు చేస్తూ వినయ విధేయతలు కలిగి బుద్ధిగా ప్రవర్తించేవాడు . గురువు గారికి ప్రియ శిష్యుడుగా మారినాడు . గురువు గారు కూడా కచుని ప్రవర్తనను గమనించేవారు . బృహస్పతి కుమారుడవడం చిన్న తనము నుండి వేదాధ్యయనము చేయడము, ఆశ్రమము వాతావరణము లో పెరగడం మరియు సాదు స్వభావము కలిగి ఉండుటచే మిగతా రాక్షస బాలుర కంటే భిన్నంగా కన్పించేవాడు.

గురూగారికి పూజాది కార్యక్రమాలకు కావలసిన సామగ్రి నంతటిని సమకూర్చడం , సపర్యలు చేస్తూ అత్యంత ప్రియశిష్యుడు గా తయారయ్యాడు . శుక్రాచార్యునికి  ఒక కుమార్తె ఉన్నది . ఆమె పేరు దేవయాణి . ఇంచు మించు ఇద్దరూ సమ వయస్కులు . కచుడు మరియు దేవయాని ఇద్దరూ ఒకరి నొకరు ఇష్ట పడేవారు . కొన్నాళ్ళకు ఇష్టం ప్రేమగా మారింది .

ఇదిలా ఉండగా గురువుగారు తమకన్నా కచుని పై ఎక్కువ ప్రేమాభిమానములు చూపిస్తున్నారని మిగతా రాక్షస బాలురకు రోజు రోజుకు ఈర్ష్య  , అసూయలు పెరిగి పోసాగాయి.కచుని ఎలాగైనా హతమార్చాలని అదను కోసం ఎదురు చూస్తున్నారు .
ఒకరోజు వేకువనే లేచిన కచుడు పూజకు కావలసిన పువ్వులు , పండ్లు మొదలగునవి తేవడం కోసం అడవికి బయలు దేరాడు .ఇది గమనించిన రాక్షసులు కచుని వెంబడించి అడవిలో కొంత దూరములో అతనిని చెట్టుకుఉరివేసి చంపేశారు .తెల్లవారిన తరువాత చాలా సమయము వరకు కచుడు కనిపించ లేదనీ దేవయాని దిగాలుగా కూర్చొని ఉన్నది .
కుమార్తె విచారముగా కూర్చొని ఉండడం చూసిన శుక్రాచార్యుడు దేవయానిని అడిగాడు . ఏమమ్మా విచారముగా ఉన్నావని . కచుడు వేకువన అడవికి వెళ్ళినాడని ఇంతవరకు ఇంటికి చేరలేదనీ తండ్రితో చెప్పింది .
అంతట శుక్రాచార్యుడు దివ్యదృష్టి తో పరిసీలించాడు. చెట్టుకు ఉరితో వ్రేలాడుచున్నకచుని చూశాడు . వెంటనే మృత సంజీవనీ మంత్రమును ప్రయోగించి కచుని సజీవుని చేసాడు .

రాక్షసులకు కోపం తగ్గలేదు .ఎలాగైనా కచుని అడ్డు తొలగించు కోవాలని అనుకొన్నారు . మరికొన్నాళ్లకు అవకాశము చిక్కింది . శుక్రాచార్యునికి మద్యాన్ని సేవించే అలవాటు ఉండేది .రాక్షస కుమారులు ప్రతి రోజు కుండ నిండా కల్లు తెచ్చి గురువుగారికి ఇచ్చేవారుకచుడుని చంపి దహనము చేసి బూడిదను కుండలో ఉన్న కల్లులో కలిపి గురువుగారి ఇంటిదగ్గర  ఇచ్చేసారు . గురువు గారు యధావిధిగా కల్లు ను త్రాగేసారు .
కచుడు ఎంత సేపటికి ఇంటికి రాకపోవుట వలన దేవయాని విచార వదనము తో ఉన్నది . ఇది గమనించిన శుక్రాచార్యుల వారు దివ్య దృష్టితో గమనిచాడు . కచుడు బూడిద రూపములో తన గర్భములో ఉన్నాడని తెలుసుకొని అవాక్కయాడు . అలోచించి తన తపోబలముచే గర్భములో బూడిద రూపములో ఉన్న కచుని మానవ రూపములోకి మార్చాడు . యోగ ప్రభావము వలన కచునికి మృత సంజీవనీ మంత్రం ను బోధించాడు . అంతట కచుడు శుక్రుని గర్భమును చీల్చుకొని బయటకు వచ్చి చచ్చి పడియున్న గురువు గారిని బ్రతికించాడు .

శుక్రాచార్యుడు .. 1



శుక్రుని గురించి ఒక విశిష్టమైన కధ ఉన్నది . 

ఈయన మద్యపాన ప్రియుడు , కోపిష్టి . ముందు వెనుకలు ఆలోచించ కుండా ప్రవర్తించే లక్షణములు కలవాడు .
దేవతలకు గురువు బృహస్పతి . రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు . దేవతలు ,రాక్షసులు కలసి క్షీర సాగరమును మదించి నపుడు మొదట కాల కూట విషం పుట్టింది .

 ఈ విష ప్రభావమును ఎవరూ తట్టుకోలేక పోయారు . అపుడు అందరూ అలోచించి కాల కూట విష ప్రభావమును తట్టుకొనే శక్తి ఈశ్వరునికి తప్ప మరెవరికి లేదనీ . పరమేశ్వరుని ప్రార్ధించారు . అంతట ఆదిదేవుడైన శివుడు ప్రత్యక్ష్యమై కాలకూట విషమును స్వ్వీకరించాడు . విష ప్రభావము వలన పరమేశ్వరుని గొంతు నీలముగా మారింది  . అందుకే శివునకు నీలకంటుడు అని పేరు వచ్చింది .

తరువాత పాల సముద్రం నుండి అమృతము పుట్టింది . ఈ అమృతమును పంచుకొనే సమయములో దేవ , దానవులుకు యుద్ధం జరిగింది . బృహస్పతి దేవతలకు , శుక్రాచార్యుడు రాక్షసులకు యుద్ధము నందు మెలకువలను తెలియ పరస్తూ తమ తమ శిష్యులకు యుద్ధ నైపుణ్యములను నేర్పుచూ మానిటర్ చేస్తూన్నారు .

శుక్రాచార్యునికి ‘’ మృత సంజీవనీ విద్య తెలుసు’’ ఈ మృత సంజీవనీ విద్యను ఉపయోగించి మంత్ర ప్రభావముచే యుద్ధము నందు చనిపోయిన తన శిష్య గణమైన రాక్షసులకు ప్రాణం పోసి తిరిగి బ్రతికించు చున్నాడు . దీని వలన రాక్షసుల సంఖ్యఅలాగే ఉంది కానీ దేవతలు నానాటికీ తరిగి పోతున్నారు .

దీనికి ప్రత్యామ్నాయము ఏమిటి అని దేవతలందరూ ఆలోచించ సాగారు . దేవ గురువు అయిన బృహస్పతికి మృత సంజీవినీ విద్య తెలియదు . మరి ఎలా అని ఆలోచించగా ఒక ఉపాయము తట్టింది .

దేవతలలో ఒకరు ఈ విద్యను నీర్చుకోవాలని నిర్ణయించుకొన్నారు . దానికి సమర్ధుడైన వారు ఎవరున్నారని అని వెతకగా యువకుడు , బుద్దిమంతుడు , జ్ఞాని , ఏక సంధాగ్రాహుడు అయిన బృహస్పతి కుమారుడు కచుడు గుర్తుకు వచ్చాడు .

వెంటనే కచుని శుక్రుని వద్ద శిష్యునిగా చేర్పించేందుకు సిద్ధ పడ్డారు .
మిగతాది తరువాత శీర్షికలో ....................

2013-06-29

మేషలగ్నము – శుక్రుడు 7 -12

మేష లగ్నములో జన్మించిన వారికి సప్తమ స్థానములో  శుక్రుడున్న తమ కుటుంబము కన్నా అత్తగారి కుటుంబము స్థితి మంతులై ఉంటారు . వీరు జీవిత భాగస్వామి మాటకు విధేయులై ఉంటారు. మంచి ఆనంద మయ దాంపత్య జీవితమును అనుభవిస్తారు. ఇక్కడ శుక్రుడు కేంద్ర స్థితిని పొంది స్వక్షేత్ర స్థితిలో ఉండుట వలన మాలవ్య మహాపురుష యోగము ఏర్పడుచున్నది . జాతకులకు శుక్ర మహాదశ వివాహ అనంతరము వస్తే చాలా గొప్ప స్థితికి చేరుకొంటారు .

అష్టమ స్థాన శుక్ర స్థితి యున్న జాతకులు స్త్రీ మూలకముగా కష్టములు ఎదుర్కొంటారు . వీరికి భాగస్వామ్య వ్యాపారములు గానీ , ఇతర వ్యవహారములు గానీ పనికి రావు . ఏదైనా స్వంతంత్రము గా ఆలోచించి చేసుకోవాలి .తప్ప ఇతరుల సలహాలు సూచనలపై నడచుట మంచిది కాదు . భార్య మాటకు విలువ నివ్వరు . భార్య భర్త ఇరువురు ఒకరినొకరు దూషించుకొను స్వభావము ఉంటుంది .

భాగ్య స్థానము అనగా తొమ్మిదవ ఇంట శుక్రుడున్న జాతకులు వివాహము వలన లాభ పడతారు . పురుషుల  కైతే భార్య ఉన్నత స్థాయి కలిగిన కుటుంబము నుండి వస్తుంది . స్త్రీలకు  అయితే ఆమె మెట్టినింట అనగా అత్త వారింట అడుగు పెట్టిన నాటి నుండి ఐశ్వర్యముతో తులతూగుతారు . సామాన్య కుటుంబము పుట్టిననూ ఇట్టి శుక్ర స్థితి కలిగిని అమ్మాయిని పెండ్లి చేసుకున్న వారింట ధనలక్ష్మి తాండవ మాడుతుంది .
రాజ్య స్థానము అనగా పదవ ఇంట శుక్ర స్థితి కలిగిన జాతకులకు భాగస్వామ్య వ్యవహారముల వలన , స్త్రీలవలన జీవితము స్థిర పడుతుంది . సాధారణము గా వీరికి అత్తగారి కుటుంబ ప్రోత్సాహం ఉంటుంది . భార్య సలహాలను పాటించుట మంచిది . 

లాభ స్థానము లో శుక్రుడు ఉన్న జాతకులకు స్త్రీ మూలకముగా అనేక లాభములు కలుగుతాయి . భాగస్వామ్య వ్యవహారముల యందు బాగా కలసి వస్తుంది . భార్య , భర్త ఇద్దరూ సంపాదనా పరులై ఉంటారు . అట్లు లేకున్నా వివాహము జరిగిన నాటి నుండి ఉన్నతమైన అభివృద్ది కలుగుతుంది .

పన్నెండవ ఇంట శుక్రుడున్న జాతకులు స్త్రీల మూలకముగా ధన నాశనము కలుగుతుంది . విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు . ధనము యొక్క విలువ తెలియక విచ్చల విడిగా ఖర్చు చేయుటయే కాక ఆర్ధిక ఇబ్బందులను కొని తెచ్చుకొంటారు . గతములో ఉన్న ఆస్తులను పాడు చేస్తారు . స్త్రీ లోలత్వము కలిగినవారు . వీరు ఆర్ధిక వ్యవహారములను తాము స్వయముగా నిర్వహించుట మంచిదికాదు .ప్రేమ కార్య కలాపములు ఉంటాయి .  

మేష లగ్నము - శుక్రుడు 1 - 6

మేష లగ్నములో జన్మించిన వారికి ధన సప్తమాదిపతి అయిన శుక్రుడు లగ్నములో ఉంటే వీరు ఎప్పుడూ పరి శుభ్రము గా ఆంటారు . మంచి వస్త్ర ధారణ చేస్తారు . వీరి చేతిలో ఎప్పుడూ ధనము ఉంటుంది . భార్యా భర్త మధ్య ప్రేమాను బంధములు బాగుంటాయి . ఒకరిని విడచి ఒకరు ఉండలేరు .

2 వ ఇంట శుక్రుడున్న జాతకులకు శుక్రుడు స్వక్షేత్ర స్థితిలో ఉండుట వలన ధనమునకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. వీరికి అనేక విధముల ధన ప్రాప్తి కలుగును . కుటుంబము వృద్ధి చెందును . సౌమ్యముగా మాతలాడుచూ ఇతరులను ఆకర్షిస్తారు .వీరికి కుటుంబములో ప్రత్యెక గౌరవము ఉంటుంది .

౩ వ స్థానములో శుక్రుడు  ఉండుట వలన  అక్క చెల్లెలు పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు . కొంచెం బిడియము సిగ్గు కలవారు. వీరు సభా పిరికి కలవారవుతారు .

4 వ భావము నందు శుక్రుడున్న జాతకులు మంచి గృహ సౌఖ్యము కలవారు . స్త్రీలన్న గౌరవము . గృహము ఎల్లప్పుడూ సంతోషముగా , అందముగా ఉండే విధముగా చూసుకుంటారు .మాతృ సౌఖ్యము కలవారు . సూక్మ పరిశీలన శక్తి కలిగి ఉంటారు .

పంచమ స్థితిలో ఉన్న శుక్రుని ప్రభావము వలన బుద్ది మంతులై తెలివి కలిగిన సంతానము కలుగుతుంది . కానీ ఎక్కువగా స్త్రీ సంతతి కలుగు అవకాశమున్నది .

ఆరవ స్థానము నందు ఉన్న శుక్రుని ప్రభావము వలన జాతకునికి ముఖ సంభంద రోగములు కలుగును . వీరికి దంతములు సంభందించిన వ్యాధులతో గానీ , నేత్రములకు సంభందించిన రోగములతో గానీ భాద పడతారు . భార్య భర్తల మధ్య సయోధ్య ఉండదు .  

2013-06-28

మేష లగ్నము -బుధుడు 7 - 12

మేష లగ్నమున జన్మించిన వారికి బుధుడు సప్తమ భావములో ఉండుట వలన మిత్ర క్షేత్ర స్థితిని పొంది నప్పటికీ షష్ఠమాధిపతి అగుట వలన మేనరిక వివాహము జరుగుటకు అవకాశమున్నది . జాతకులు తమకు నచ్చిన వారిని వివాహమాడుటకు ప్రయత్నించిననూ కుటుంబ సభ్యుల ఒత్తిడి వలన వీరు స్వయం నిర్ణయమునకు రాలేరు .

అష్టమ భావమునందున్న బుధుని ప్రభావముచే వీరికి అనేక కష్టములు ఏర్పడతాయి . ఇక్కడ కుజ బుధ గ్రహములు కలసి యుంటే వారసత్వముగా ఉండే రోగాల వలన భాద చెందుతారు . వారసత్వపు ఆస్తులు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా అనుభవింపలేరు . జీవిత చరమంకమునందు ఎక్కువగా జబ్బుపడి తనువు చాలింతురు .

తొమ్మిదవ స్థానము ధనుస్సులో బుధుని స్థితి యున్న జాతకులకు తండ్రికి సంభందించి ఆర్ధిక ఒడుదుడుకులు ఏర్పడును . తండ్రితో ప్రతి విషయములోనూ విభేదిస్తారు . తమ అభివృద్ధికి తగిన శ్రద్ధ తీసుకోలేదనీ ఎల్లప్పుడూ తండ్రిని నిందిస్తారు .  

పదవ  ఇంట మకరము నందు బుదుడున్న జాతకులకు ఉద్యోగ స్థిరత్వము ఉండదు . అదృష్టవశాత్తు మంచి పొజిషన్ కలిగిననూ వీరు స్వయంకృతం వలన మధ్యలో విడచి పెడతారు . పంతాలు , పట్టింపులు ఎక్కువ .

లాభ స్థాన గతుడైన బుధుని ప్రభావము వలన ఫైనాన్సు రంగములో వీరు బాగా వృద్ది చెందుతారు .ఆర్ధిక వ్యవహారములలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు . ఇక్కడ బుధుని స్థితి వలన సునాయాస ధనయోగము కలుగు చున్నది .

తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు పన్నెండవ భావములో ఉండగా జన్మించిన జాతకులకు అనారోగ్య సంభంధముగా ఎక్కువగ్గా ధనము వ్యయ మగును . దాంపత్య సౌఖ్యము తక్కువగా ఉండును . సోదరులసహాయమును పొందలేరు . 

మేషలగ్నము – బుధుడు 1 - 6

మేష లగ్నములో జన్మించిన వారికి లగ్నమునందు బుధుడు ఉంటుండగా పుట్టిన జాతకులకు అనారోగ్యము ఉంటుంది . ఈ దశా కాలములో కామెర్లు సంభందించిన వ్యాధులు ఏర్పడతాయి . చర్మ సంభంద వ్యాధులు , ఎలర్జీలు మొదలగు వ్యాధులు తో భాదపడతారు . వీరు ఎప్పుడు అప్పులు చేయుటలో ముందుంటారు .ఆర్ధిక ప్రణాళిక లేక పోవుటవలన రుణగ్రస్తులవుతారు .

2 వ స్థానము నందు వృషభ రాశిలో బుదుడున్న జాతకులు వడ్డీ వ్యాపారము బాగా చేస్తారు ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు చేస్తారు . మంచి వాక్చాతుర్యము కలవారు . అయిననూ కుటుంబములో ఇతర సభ్యులతో సఖ్యతగా ఉండలేరు . ధన విషయములో ఎవరిని నమ్మరు . 

౩ వ స్థానము న బుధుడు స్వక్షేత్ర స్థితిలో ఉండుటవలన జాతకులకు కొంత ఆయుర్భలము పెరుగును . వీరికన్నా తోడబుట్టిన వారు  మంచి పొజిషన్లో ఉంటారు. సూక్ష్మ బుద్ది , నిశిత పరిశీలన కలిగిన వారవుతారు .

తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు నాల్గవ స్థానములో ఉండుట అంత శ్రేయస్కరము కాదు . జాతకులకు గర్భ సంభంద రోగములను కలుగ జేయును . విద్యా భ్యాస సమయములో ఈ దశా అంతర్ధశలు వస్తే తప్పక విద్యకు ఆటంకము ఏర్పడును . వివాహానంతరము ఈ దశ జరుగుచున్న వారికి గృహము తాకట్టులో ఇరుక్కు పోవుట గానీ , అప్పులు చేసి గ్రహము నిర్మించు కోవడం జరుగుతుంది. చివరకు అప్పులు తీర్చలేక ఇల్లు అమ్మవలసిన పరిస్థితులు ఏర్పడగలవు . వాహన ప్రమాదములు జరుగుతాయి .

పంచమ స్థానమున బుదుడున్న జాతకులకు సంతానము కలుగదు  , స్త్రీలలో అయితే గర్భము పెరగదు  గర్భసంచి లోపము వలన పిల్లలు కలుగరు . పురుషులలో వీర్య వృద్ధి ఉండదు .మేష లగ్నమున పుట్టిన వారికి రవి బలము , గురు బలము బాగుండక పోయిన యెడల సంతానము పూర్తిగా ఉండదు .

ఆరవ స్థానములో బుధుడు స్వక్షేత్ర , మరియు ఉచ్చ స్థానములో ఉండుట వలన జాతకులు  మేన మామలు , మేనత్తల సహాయ సహకారములు పొందువారగుచున్నారు .  సాధారణముగా వీరు ఎవరితోనూ శత్రుత్వము పెట్టుకొనుట మంచిదికాదు . ఎక్కువగా అపజయములు ఎదుర్కొను అవకాశమున్నది . ఆరోగ్యవిషయములో చాలా జాగ్రత్త అవసరము . అప్పులు చేయుట లేక లోన్లు వాడుట అంత మంచిది కాదు .       

2013-06-22

మేష లగ్నము - చంద్రుడు 7- 12

మేష లగ్నమునకు ఏడవ ఇంట చంద్రుడున్న జాతకులకు సాధారణంగా తల్లికి సంబంధించిన కుటుంబము నుండి అనగా మేనరికము నకు సంభందించినది గానీ లేక తల్లి యొక్క బంధువుల నుండి జీవిత భాగస్వామి లభించును . ఇక్కడ చంద్రుడుండగా లభించును . జీవిత భాగస్వామి సౌమ్యులు , మృదు స్వభావము కలిగిన వారు లభించును .

అష్టమము నందు చంద్రుడు ఉన్న జాతకులు. మేష లగ్నమునకు 8 వ రాశి వృశ్చిక రాశి అవుతుంది . ఈ రాశి చంద్రునకు నీచ స్థానము అవుతుంది . అందు వలన తల్లికి అనేక విధముల కష్టములు సంభవించు చున్నవి . విద్యా విషయములో ముందుకు వెళ్ళుట కష్టము . వాహన యోగము కలిగినా చాలా జాగ్రత్త అవసరము . గృహము నందు అనేక విధముల సమస్యలు ఏర్పడతాయి . బంధువుల మధ్య సయోధ్య ఉండదు .

తొమ్మిదవ స్థానము లో చంద్రుడున్న జాతకులకు తండ్రికి సంభందించి అనేక విధముల అభివృద్ది కలుగును . భూమి , గృహము , ధనాదులు చాలా బాగా వృద్ది చెందుతాయి . గొప్ప కీర్తి వంతులుగా తయారవుతారు .

పదవ ఇంట చంద్రుడున్న జాతకులకు ముఖ్యముగా తెలుపు వస్తువుల, నీటి సంభందము , మరియు ద్రవరూప సంభంద పరిశ్రమల లో గానీ ఆయా సంభంద వ్యాపార విషయములలో గానీ బాగా రాణిస్తారు .

పదకొండవ ఇంట చంద్రుడుండగా పుట్టిన వారికి రియల్ ఎస్టేట్ , మొదలగు వాటి వలన మరియు మాతృ వర్గము వారి వలన మరియు కనస్ట్రక్షన్ రంగముల వలన ఇంకా అనేక విధముల లాభములు పొందుతారు. జాతకులు స్వశక్తి తో గృహము నిర్మించుకొను భాగ్యము కలుగుతుంది  

పన్నెండవ స్థానము నందు చంద్రుడు ఉండగా జన్మించిన జాతకులు ఈ దశా అంతర్ధశ సమయములు జరుగు చున్న సమయములో ఆస్తి నష్టము సంభవించును . ఈ దశా సమయమునకన్నా ముందు గృహ నిర్మాణము చేసియుంటే ఆర్ధిక ఇబ్బందుల వలన ఒక్కొక్కప్పుడు ఇల్లు అమ్ము కోవలసి ఉంటుంది . ఉద్యోగ , వ్యాపారముల యందు నష్టములు ఏర్పడును  . కావున ఈ సమయములో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి . బంధువుల వలన నష్టములు ఏర్పడును .

ఈ పైన తెలిపిన ఫలితములు మేష లగ్నము నుండి 4 వ కేంద్రాదిపతి చంద్రుని వలన కలిగే ఫలితములు . చంద్రుని వృద్ది , క్షీణత్వములను బట్టి పై ఫలితములలో మార్పులు హెచ్చు తగ్గులు గా ఉంటాయి .          

2013-06-21

మేష లగ్నము - చంద్రుడు 1- 6

’’ పిండి కొలది రొట్టె ‘’
జాతకులు జన్మించినపుడు ఉన్న గ్రహాల బలాబలముల అధారముగానే ఫలితములు కల్గును . 
మేష లగ్నమునకు చతుర్ధాధిపతి అయిన చంద్రుడు కేంద్రాధిపతి అగుట వలన పాపి . ఈ లగ్నమునకు  క్షీణ చంద్రుడు అయితే శుభ ఫలితములను , పూర్ణ చంద్రుడు అయితే పాప ఫలితములను ఇచ్చుటలో బలవంతుడు .
చంద్రుడు లగ్నమున యున్న జాతకులు మృదు స్వభావులు , చంచల మనస్సు కలవారు , భయస్తులుగా ఉంటారు .వీరికి తొందర పాటు ఎక్కువ . ఏ విషయములోనూ సరియైన నిర్ణయము తీసుకోలేరు 
.
రెండవ ఇంట చంద్రుడు ఉన్న జాతకునకు చతుర్దాదిపతియై ఉచ్ఛ స్థితిని పొందుట వలన జాతకుడు మంచి విద్యావంతుడు , సుఖము మరియు సునాయాస ధనయోగము కల్గును . వీరికి మాత్రు వర్గము వారి వలన గానీ , విద్యావలన గానీ ,గృహముల వలన గానీ ధనప్రాప్తి కల్గును .

ఇక్కడ గమనించ వలసిన విషయము కుజుడు బలవంతుడై ఉంటే వ్యవసాయము వలననూ , వివిధ రకముల మట్టి మూలమున అనగా గృహ నిర్మాణ రంగములు , కాంట్రాక్టులు , మున్నగు వాటివలన ధన యోగము ప్రాప్తిన్చుచున్నది 

బృహస్పతి బలము కలిగి యుండిన జాతకులకు విద్యామూలమున , గృహములు , అద్దెల మూలమున మరియు తన వాక్చాతుర్యము చే మధ్య వర్తిత్వము చేయు వ్యవహారముల వలన , భోధన విధానముల వలన ఇలా అనేక విధముల ధన యోగము కల్గుచున్నది .

మూడవ ఇంట చంద్రుడున్న జాతకులకు శౌర్య పరాక్రమములు తక్కువగా ఉండును . మాతృ సంభంద విషయములలో కొంత నష్టము సంభవించును . ఒక్కొక్కప్పుడు విద్యా వ్యవహారములలో కొద్ది ఆటంకాలు ఏర్పడవచ్చును .సోదరీలు ఎక్కువగా ఉంటారు . వీరి యొక్క భాద్యతలు కూడా ఉండును .

నాల్గవ స్థానమున చంద్రుడుండిన జాతకునకు ఇక్కడ చంద్రునికి స్వక్షేత్రము అగుట వలన మాత్రు ప్రేమ అధికము .మంచి విద్య ప్రాప్తించును . ఈ చంద్ర మహా దశా కాలమున మంచి గృహము నిర్మాణము చేయుదురు . సుఖవంతమైన జీవనము ఏర్పడును . 

పంచమ స్థాన చంద్ర స్థితి వలన సాధారణముగా మొదట సంతతికి నష్టము ఏర్పడుట గానీ , లేక స్త్రీ సంతతి గానీ కలుగ వచ్చును , మంచి ప్రయోజకులైన సంతాన ప్రాప్తి కల్గును.

ఆరవ ఇంట చంద్రుడు ఉండిన జాతకులకు గర్భ సంభంధమైన అనారోగ్యము కల్గును . విద్యకు మధ్యలో ఆగి పోవచ్చు .తల్లికి అనారోగ్యము తప్పదు.
మిగతా భావాలను గురించి తదుపరి శీర్షికలలో ................

మేష లగ్నము


మేష లగ్నమున జన్మించిన వారికి పంచామాధిపతి రవి , భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు కోణాధిపతులై శుభ ఫలితములు ప్రసాదించ గలరు . రవి కన్నా గురుడు ఉత్తమ యోగములు కలుగ జేయును . ఏ లగ్నమున కైనా కేంద్ర కోణ అధిపతులైన గ్రహాలూ పరివర్తన చెందిననూ ఒకరి ఇంట మరియొకరు ఉన్ననూ ఉత్తమ రాజ యోగ కారకులగుచున్నారు 
.
ఈ లగ్నమున జన్మించిన వారికి నైసర్గిక పాప గ్రహము అయిన సూర్యుడు పంచమ కోణ ఆధిపత్యము వచ్చుట మంచిది . కాబట్టి సూర్యుడు శత్రు క్షేత్రము లైన మకర కుంభ రాశుల యందు గానీ ,వృషభరాశి యండుగానీ , నీచ క్షేతము నందు గానీ ఉండుట మంచిది . 

ఈ విధముగా ఉన్నప్పుడు ఈ రవి దశా అంతర్ధశలు నడుస్తున్న జాతకులు అన్నింటా విజయము వరించు చున్నది .రాజకీయ వ్యవహారముల యందు ,సంఘమునందు గౌరవ మర్యాదలు పెరుగును . జీవిత స్థిరత్వము కలుగును . ఉద్యోగ లాభము , ప్రమోషన్స్ మొదలగునవి లభించును .

భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు చతుర్ధ స్థానము అనగా కర్కాటక రాశిలో స్థితి పొంది యుంటే ఈ జాతకులకు హంస మహాపురుషయోగము అను యోగము పట్టును . ఇది విద్యా స్థానము . ఈ స్థానము నందు గురుడు ఉచ్ఛ స్థితిలో ఉండుట వలన మంచి విద్యా యోగము కలుగుటయే  కాక  అన్నింటా మొదటి ర్యాంకులు పొందుట గొప్ప జ్ఞాన వంతులు , మేధావులుగా తయారగుదురు . వీరికి శారీరకముగా శ్రమ పడరు . తమ బుద్ది బలముచే తెలివి తేటల వలన పెద్ద పెద్ద ఉద్యోగములను సాధింతురు . 

జాతకులకు ఈ దశా అంతర్ధశలు సంభవించిన కాలములో సన్మానములు పొందుట , పెద్ద , పెద్ద అవార్డులను , బిరుదులను అందుకొనుట జరుగును . అంతే కాక విశేష కీర్తిని సంపాదిన్తురు . కానీ ఈ గురు దశా రెండవ భాగమునందు , గురునుకున్న వ్యయ భావ ఆధిపత్యము వలన కొంత కష్ట నష్టము సంభవించు అవకాశము ఉన్నది .

ఈ కర్కాటక రాశిలో గురు చంద్ర గ్రహములు కలిసి యుంటే గజకేసరి యోగము కూడా పట్టుచున్నది .
ఈ యోగ ఫలితముచే సమాజమున ఉన్నత ప్రమాణములు కలిగిన వ్యక్తిగా గౌరవవింప బడుట ,పూజ్యులుగా రాణించడం . గొప్ప ఉపన్యాసకులు , సంఘ సంస్కర్తలుగా రాణింతురు .

ఈ రాశి పునర్వసు 4వ పాదము , పుష్యమి, అశ్రేష నక్షత్రములకు చెంది ఉంటుంది
పునర్వసు 4 వ పాదములో జన్మించిన వారికి గురు మహాదశ  బాల్యమున సుమారు 4 సంవత్సరములు ఉంటుంది . పుష్యమి అశ్రేష నక్షత్రములలో జన్మించిన వారికి గురు మహాదశ రాదు . కావున చంద్ర మహాదశ అంతర్దశల లోనూ . గురుని అంతర్ధశల లోనూ ఉత్తమ యోగములు కల్గించును . .      

2013-06-20

How to Research Horoscope

జాతక పరిశీలనా విధానము

ఏ లగ్నమున జన్మించిన వారికైననూ కేంద్ర కోణాధిపతులు ఎల్లప్పుడూ శుభాన్ని చేకూరుస్తారు . లగ్నమునుండి 1 ,4 , 7, 10 స్తానములు కేంద్ర స్తానములు . 1 , 5 , 9  స్థానములు కోణములు . ఇక్కడ లగ్నాధిపతి కేంద్ర అధిపతి గానూ ,కోణాధిపతి గానూ రెండు విధాలుగా పరిశీలించాలి .

లగ్నమునుండి ప్రారంభించి 1, 4, 7, 10 స్థానములను కలుపుతూ ఒక చతుర్భుజమును ఏర్పాటు చేద్దాం .ఈ చతుర్భుజమునకు ఉన్న మూలలను కేంద్రములంటారు . ఆయా స్థానముల అధిపతులే కేంద్రాదిపతులు అగుదురు .

లగ్నమునుండి ప్రారంభించి 1, 5 , 9  స్థానములను కలుపుతూ ఒక త్రిభుజమును ఏర్పాటు చేద్దాం  ఈ త్రిభుజము యొక్క మూలలే కోణములు . వీటికి అధిపతియైన గ్రహములే కోణాదిపతులు .
కేంద్రాది అధిపతి యైన గ్రహములు పాప గ్రహములై ఉంటే శుభ ఫలితములను కలుగ జేస్తాయి . శుభ  గ్రహములైతే పాప ఫలితములను కలుగ జేయును .

కోణములకు అధిపతులు అయిన శుభ గ్రహాలు శుభాన్ని పాప గ్రహాలు పాప ఫలితమును కలుగ జేస్తాయి .
సూర్య , కుజ , శని , రాహువు , కేతువు ,క్షీణ చంద్రుడు , పాపులతో కలసిన బుధుడు పాప గ్రహములు .
పూర్ణ చంద్రుడు , శుభులతో కలసిన బుధుడు , గురుడు , శుక్రుడు శుభ గ్రహములు.

శుభ గ్రహములకు కోణాధి పత్యము , పాపగ్రహములకు కేంద్రాది పత్యము వచ్చుట మంచిది .
మానవుడు జన్మించిన సమయమునకు ఏర్పడిన లగ్నమును బట్టి భావాదిపత్యములను తెలుసుకొని శుభ పాపత్వములను విచారించి ఫల నిర్ధారణ చేయ వలసి వుంటుంది .

లగ్నాత్తు 6 , 8 , 12 స్తానదిపతులు ఎల్లప్పుడూ పాప ఫలితములను కలుగ జేయుదురు . వీరు ఒకరి ఇంట మరియొకరు పరివర్తన చెంది ఇతరులతో కూడక ఉన్నప్పుడు మాత్రము విపరీత రాజ యోగము కలుగు చేయుచున్నారు . గ్రహముల యొక్క బలాబలముల నిర్ణయము చేయనిచో జాతక ఫలితములు నిర్ధారణ చేయుట సాధ్యము కాదు .    

2013-06-19

జాతక పరిశీలన ఎలాచేయాలి?



జాతకము ద్వారా మానవుని జీవన విశేషములు తెలుసుకోవచ్చు . జాతక పరిశీలనలో అనేక మార్గములున్నవి . గ్రహ చారము , గో చారము , గ్రహ దశ , భావ విశ్లేషణ, గ్రహముల కున్న శుభత్వ , పాపత్వము లను , గ్రహల స్థితి , దృష్టి , యుతి గ్రహముల బలాబలములు ఇలా అనేక విధములుగా పరిశీలన చేసి ఫలిత నిర్ధారణ చేయవచ్చు .
గ్రహచారము అంటే ఏమిటి ?
జాతకులు జన్మించినపుడు గ్రహములు, రాశులు ఆధారముగా జాతకము తయారు చేసుకొంటాం . జాతకుడు పుట్టినపుడు ఉన్న గ్రహముల స్థితినే గ్రహ చారము అంటాం . వ్యక్తీ బ్రతికి ఉన్నంత కాలము ఇది శాశ్వతము .

గో చారము అంటే ఏమిటి ?
జాతకులు పుట్టినపుడు ఫలితములు తెలుసు కొనుటకు వీలుగా ఉంటుందని గ్రహాలను అవి ఉన్న స్థానాలను బట్టి రాశులలో వేసుకొని జాతక చక్రం తయారు చేసుకొంటున్నాం .కానీ గ్రహాలు అక్కడే స్థిరంగా ఉండలేదు . అవి నిత్యము సంచరిస్తూనే ఉన్నాయి . దీనినే గో చారము అంటారు .

మానవుడు పుట్టినప్పటి నుండి రోజు రోజు కు శారీరక , మానసిక స్థితులలో ఏ విధముగా మార్పులు కల్గుచున్నాయో , గ్రహాలు సంచరించే విధమును తెలుసుకొని ఫలిత నిర్ధారణ చేయుటకు ఉపయోగ పడును.  

గ్రహదశ : జన్మ నక్షత్రమును బట్టి  దశ ఏర్పడుచున్నది . దీనినే జన్మకాల దశ అంటారు . తదుపరి ఒకదాని తర్వాత మరొక దాస వస్తుంది . ఏ వ్యక్తికైనా ఫలితములు తెలుసుకొనేటప్పుడు నడుస్తున్న దశకు అధిపతియైన గ్రహమే అధికారిక గ్రహము . ఆ గ్రహము యొక్క బలమును బట్టి జాతకునకు కలుగు ఫలితములు ఆధారపడి ఉంటాయి .

భావ విశ్లేషణ : జాతకునకు సంబంధించి ఏ భావమును పరిశీలించాలని అనుకొంటున్నామో ఆభావ సంభంద గ్రహము , భావ కారకులను ముఖ్యముగా పరిశీలించాలి .

గ్రహములకు శుభత్వ, పాపత్వములు . : ఒక్కో లగ్నమును బట్టి శుభ గ్రహము పాప గ్రహముగానూ , పాప గ్రహము శుభ గ్రహముగాను మార్పు చెందును . జాతకులు జన్మ సమయమును బట్టి మార్పులు కలుగును .
గ్రహముల స్థితి , యుతి , వీక్షణ : జాతకులు పుట్టిన సమయములో గ్రహాలూ ఎక్కడెక్కడ ఉన్నాయి , ఏ ఏ గ్రహాలు కలసి ఉన్నాయి , ఏ గ్రహలచే చూడ బడు చున్నాయి . అనే విషయాన్ని చూడాల్సి ఉంటుంది .
ఇంకా అనేక విషయములను చాల నిశితంగా పరిశీలించి ఫలిత నిర్ధారణ చేయాలి .

తదుపరి  ఏ లగ్నములో జన్మించిన వారికి ఏ గ్రహాలు అనుకూలము , భావాలను గురించి ............
తర్వాత చర్చించుకొందాం          

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...