2013-07-31

త్రింశాంశ

ఈ రోజు మనము త్రిశాంశ ను గురించి తెలుసు కొందాం ?
త్రిశాంశ అంటే ఏమిటి ?

జాతకులు పుట్టిన జన్మలగ్నమును , జాతకమునందు గ్రహములు ఏ ఏ రాశులలో ఉన్నాయో ఆయా రాశులను ౩౦ భాగాలుగా విభజించాలి . దీనినే త్రిశాంశ అంటారు . అయితే ప్రతి రాశికి ఈ త్రిశాంశ ఒకేలా ఉండదు .త్రిశాంశ ౩౦ భాగాలకు కుజాది పంచ గ్రహములే అధిపతులగు చున్నారు . అయితే బేసి రాశులైన మేష , మిధున , సింహ , తుల, ధనుస్సు , కుంభ రాశులకు వరుసగాను , సరి రాశులైన వృషభ , కర్కాటక , కన్య , వృశ్చిక , మకర , మీన రాశులకు వ్యతిరేఖముగానూ చూడాలి .


త్రిశాంశ ౩౦ భాగాలకు జన్మ లగ్నము గానీ , జన్మ రాశి గానీ బేసిరాశి  అయితే మొదటి 5 భాగాలకు కుజుడు తరువాత 5  భాగాలకు శని ఆ తరువాత 8 భాగాలకు గురుడు 7 భాగాలకు బుధుడు 5 భాగాలకు శుక్రుడు అధిపతులు అగుదురు అదే జన్మ లగ్నము జన్మ రాశి గానీ సరి రాశి అయితే 5 భాగాలకు శుక్రుడు 7 భాగాలకు బుధుడు 8 భాగాలకు గురుడు 5 భాగాలకు శని చివరి 5 భాగాలకు కుజుడు అధిపతులు అగుచున్నారు ..

ఇక్కడ గమనించవలసిన విషయము వివాహ సంభందము చూసుకొనే సమయములో స్త్రీ యొక్క లక్షణములను , గుణమును , ప్రవర్తననూ తెలుసుకొనుటకు ఈ త్రిశాంశ పద్దతి ఉపయోగ పడుననీ మహర్షుల అభిప్రాయము . అందు వలనేమో స్త్రీ జాతకమును పరిశీలించే టపుడు త్రిశాంశ తప్పక విచారించ వలెననీ తెలిపి యున్నారు . అయితే స్త్రీ పురుషుల ఇద్దరికీ త్రింశాంశ విచారణ చేయుట మంచిదని నా అభిప్రాయము .  

ఈ త్రిశాంశ భాగాలలో జన్మించిన వారి ఫలితములు ఎట్లుండునో తరువాత శీర్షికలో తెలుసు కుందాం .వివరిస్తాను .   

2013-07-30

జ్యోతిష్యశాస్త్రము- అవసరము



          శ్లోకం :   యద్దినే పతతేశుక్రః మాతృ గర్భేణ నిర్మితః
                   లలాటే లిఖితే ధాతా లాభాలాభ శ్శుభాశుభః

తాత్పర్యము : ఏ దినమున శుక్లము పడినదో అప్పటి నుండి తల్లి గర్భములో అండము పిండముగా మారి జీవి స్వరూపమును, నిర్మాణము జరిగే సమయములోనే ఆ జీవియొక్క భవిష్యత్తును గురించి వ్రాయబడుతుంది . పుట్టిన తరువాత జీవితమున కలుగు లాభము , నష్టము , శుభము , అశుభము మొదలగు సమస్త విషయములను సృష్టికర్త యైన బ్రహ్మదేవుడు నుదిటిపై లిఖిస్తాడు .
    ,
జ్యోతిష్యము అనగా మార్గనిర్దేశనము చేసేది.

దీపం వెలుగుతూ ఉన్నప్పుడు చీకటిని పారద్రోలి కాంతిని ప్రసరిస్తుంది.. అలాగే జ్యోతిష్యము కూడ మానవుని జీవన ప్రయాణములో ఏది మంచి , ఏది చెడు అని తెలుసుకోవడానికి ఉపయోగ పడుతుంది. ఏ శాస్త్ర , సాంకేతికత లేని రోజుల్లో కార్తెలను తెలుసుకొని ఆయా కాలానుగుణముగా పంటలు వేసేవారు . కార్తెలకు అనుగుణముగా వేర్వేరు పంటలను పండించేవారు . మన భారతీయ సాంప్రదాయములను, ఆచారములను, తెలియపరస్తుంది .పండుగలు మొదలగు వాటి గురించి తెలుసు కోవచ్చు . ఇలా అనేక విధములుగా జ్యోతిష్య శాస్త్రము మనకు ఉపయోగ పడుతుంది . 
ఈనాడు మానవుడు సృష్టికి ప్రతి సృష్టి చేయుచున్నాడు . వాతావరణమును తనకు అనుకూలంగా మార్చుకొను చున్నాడు .:
1  వేసవి కాలము : విపరీతమైన ఎండలు ఉన్నప్పుడు ఉష్ణోగ్రత ప్రభావమును తట్టుకొనుటకు వీలుగా ఏ సి కనుగొన్నాడు . చల్లని పదార్ధములు భుజించడం , చెవులకు గుడ్డలు కట్టుకోవడం , టోపీలు ధరించడం మొదలగు జాగ్రత్తలు తీసుకొంటున్నాడు
2 వర్షాకాలము : బాగా వర్షం కురుస్తుంది . ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాలి .వర్షములో తడవకుండా ఉండడానికి గొడుగు కనిపెట్టాడు . వైరల్ పీవర్స్ , అంటువ్యాధులు రాకుండా జాగ్రత్త పడుతున్నాము .
౩శీతాకాలము : విరీతమైన చలి కాలములో చలి నుండి తట్టుకోడానికి హీటర్లు కని పెట్టాడు .రగ్గులను కప్పుకోవడం , కాటన్ బట్టలు వాడడం , ఇలా అనేక జాగ్రత్తలు తీసుకొంటున్నాం .

ఇక్కడ ఒక విషయమును మనం గమనించాలి . అది ఏమిటంటే మానవుడు మొదట ప్రకృతికి అనుకూలముగా మారాడు . తరువాత ప్రకృతిని తనకు అనుకూలముగా మార్చుకోసాగాడు . అయితే ఏది చేసినా ఎంత చేసినా ఈ ప్రకృతి ఒడిలో ప్రకృతికి లోబడే చెయ్యాలి . మానవుడు ఒంటరివాడు కాదు. నలుగురితో కలసి బ్రతకాలి. సమాజములో తానొక్కడు మాత్రమే . కష్ట సుఖములలో , శారీరకముగా , మానసికముగా ఒకరికి ఒకరు తోడుండే వ్యవస్థలను ఏర్పాటు చేసుకొన్నాడు .

భగవంతుని పూజిస్తూ శాస్త్రమున తెలుపబడిన శాంతి కర్మలను తన ఆచార సంప్రదాయములకు అనుగుణముగా ఆచరించుట వలన కష్టములు తొలగి ఆయురారోగ్యము , ఐస్వర్యములను పొందుచున్నాడు .   

జన్మ నక్షత్ర ఫలితము – ఆశ్రేష


ఆశ్రేష నక్షత్రము లో పుట్టిన వారు క్రూర స్వభావము కలిగి ఉంటారు . కోపిష్టులు . నిదానముగా ఆలోచించలేరు . వీరికి స్వార్ధబుద్ది ఉండును. పరిస్థితులను ప్రభావమునకు లోనగుదురు . చంచల మనస్సు కలవారు .ఇతరులపై ఆధారపడి బ్రతుకుతారు . స్వతంత్రత ఉండదు . స్థిరముగా ఉండలేరు . ఈ నక్షత్రమున జన్మించిన వారి జీవితము ఒడిదుడుకులతో ఉండును. తొందరగా నిరాశ నిస్పృహలకు లోనయ్యే స్వభావము కలిగి ఉంటారు .

వీరు జీవితమున ఆలస్యముగా స్థిరపడతారు . అదృష్టవశాత్తు ఎవరో ఒకరు వీరికి బ్రతుకు దెరువు కొరకు మార్గమును చూపించ గలరు . చిన్న చిన్న సమస్యలు ఎదురైనా తట్టుకోలేరు . లోకములోని కష్టములన్ని తమకే వస్తున్నాయని భాద పడుతుంటారు . ఈర్ష్య , అసూయలు కలిగి ఉంటారు . అయిననూ దైవబలము వీరికి తోడుంటుంది .

ఈ నక్షత్ర జాతకులు యవ్వన ప్రారంభ దశలో దురలవాట్లకు లోనయ్యే ప్రమాదము ఉన్నది . ముఖ్యముగా త్రాగుడు , స్త్ర్రీల పట్ల ఆకర్షితులవడము లాంటి వ్యసనముల బారిన పడతారు. జాగ్రత్త వహించుట మంచిది . ఆరోగ్య విషయములో డస్ట్ ఎలర్జీ , స్కిన్ ఎలర్జీ మరియు చర్మ సంభంద వ్యాధులతో భాద పడతారు . ఎళ్ల వేళలా పరిశుభ్రతను పాటించుట అవసరము .

వీరు సుమారు ౩౦ సంవత్సరముల వరకు జీవితమున స్థిరపడు అవకాశములు చాలా తక్కువ . వివాహ అనంతరము కొంత మార్పు వచ్చును . జీవితభాగస్వామి వలన అదృష్టము కలసి వచ్చును . భార్యా మనస్తత్వము తెలుసుకొని ప్రవర్తించుట మంచిది . వీరు ఎదుటి వారిని నమ్మరు . తమకు తెలిసినదే యదార్ధమని అనుకొంటారు .తెలిసి కూడా తప్పులు చేయుటకు వెనుకాడరు . తాము చేసినది తప్పు అని తెలిసిన మొండిగా వాదిస్తారు . సంపాదన సామాన్యముగా ఉంటుంది .     


కుటుంబ సభ్యుల పట్ల అభిమానము , మమకారము కలవారు . భయమును కలిగి ఉంటారు . చేయు వృత్తి యందు కాన్సంట్రేషన్ తక్కువగా ఉంటుంది .శారీరక సౌఖ్యమునకై ప్రాకులాడతారు . భార్యను విడచి ఉండలేరు . సామ దాన దండోపాయములను ఉపయోగించి  పరిస్థితులను తమకు అనుకూలముగా మార్చుకొంటారు . ఎదుటి వారి బలహీనలతలను తెలుసుకొని దెబ్బకొడతారు 

2013-07-27

వివాహము – దోష నక్షత్రములు

అశ్రేష ,విశాఖ , జ్యేష్ట , మూల నక్షత్రములలో జన్మించిన వారికి వివాహము విషయములో కొన్ని దోషములు ఉన్నవి .అవి ఏమిటో చూద్దాం ?

ఆశ్రేష నక్షత్రములో జన్మించిన కన్య ను వివాహమాడిన అత్తగారు నశించును . విశాఖ నక్షత్రమున జనించిన స్త్రీని వివాహ మాడిన మరిదికి గండము. జ్యేష్ట నక్షత్రమున పుట్టిన పడతిని పెండ్లాడిన బావగారికి దోషము, మూలా నక్షత్రమున పుట్టిన కన్యను పెండ్లాడిన మామగారికి దోషము . అయితే పై నక్షత్రములలో జన్మించిన స్త్రీలకే గాని పురుషులకు దోషము వర్తించదని కొందరు, స్త్రీ పురుషులకు ఎవరికైనా దోషమే అని కొందరు మహర్షులు అభిప్రాయ పడి నట్లు శాస్త్రముల ద్వారా మనకు తెలియుచున్నది .

అనుభవములో చూడగా పైన తెలిపిన దోషములు అందరికి వర్తించుట లేదు . కొంతమందికి మాత్రమే వర్తించు చున్నవి.కొంతమంది విషయములో ఈ విధముగా జరుగు చున్నది . మూల నక్షత్రమున జన్మించిన వారికి మామగారు గతించిన కుటుంబము నుండి జీవిత భాగస్వామి లభిస్తుంది . ఆశ్రేష నక్షత్రమున పుట్టిన వారికి అత్త లేనటువంటి సంభందము కుదురుతుంది . అలాగే విశాఖ , జ్యేష్ట నక్షత్రముల వారికి కూడా .

దోష పరిహారముల కొరకై శాస్త్రము నందు చెప్పబడిన నవ గ్రహ శాంతి , నక్షత్ర జపములు, హోమ శాంతి , మృత్యుంజయ జపములు జరిపించుట వలన దోషమని చెప్పబడిన వారికి దోషములు తొలగి ఆయురారోగ్యములు కలుగుతాయి .

పైన తెలిపిన నక్షత్రములు దోషప్రభావము కలిగిన నక్షత్రములు కదా ?
ఆయా నక్షత్రముల యందు జన్మించిన వారిని వివాహము చేసుకోకూడదా? అని అనుమానము కలుగకమానదు. దీనికి ప్రత్యామ్నాయము ఈ విధముగా ఉన్నది . జాతక చక్రమును పరిశీలించే టప్పుడు , జ్యేష్ట సంతానము వలన తండ్రి , కనిష్ట సంతానము వలన తల్లి కి సంభందించిన విషయములు తెలుసు కోవచ్చుననీ , వారి వలన తల్లి దండ్రుల ఆయుర్దాయమును కూడా తెలియుననీ మహర్షులచే చెప్పబడినది .

ఇక్కడ మనము ఒక విషయమును  పరిగణనలోకి తీసుకొందాం . మూలా నక్షత్రమున జన్మించిన వారికి సంభందము చూసేటప్పుడు ,మొదటి సంతానముగా జన్మించిన వారికి ఇచ్చి వివాహము చెయ్యకూడదు . అలాగే ఆశ్రేష నక్షత్రమున జన్మించిన వారికి చివరి సంతానముగా పుట్టినవారికి ఇచ్చి పెండ్లి చెయ్యకూడదు

అలాగే జాతక చక్రము ప్రకారము సోదర , సోదరీమణులు గురించి ఈ విధముగా ఉన్నది . లాభస్థానము లో నైసర్గిక పాపగ్రహములు ఉన్నప్పుడు జాతకుల కన్నా ముందు పుట్టిన వారు , మూడవ స్థానమున పాప గ్రహములు ఉన్న వారికి జాతకులకన్నా తరువాత పుట్టినవారు గతించుననీ తెలియు చున్నది .

కావున జాతకము లను జాగ్రత్తగా పరిశీలించి వివాహము జరిపించాలి . ఎందు కనగా జ్యేష్ట నక్షత్రములో పుట్టిన వారి వలన బావ గారికి , విశాఖ నక్షత్రమున జనించిన వారి వాలన మరుదులకు దోషమనీ ఉన్నది . ఇక్కడ ఇంకొక విషయము జ్యేష్ట నక్షత్రములో జన్మించిన వారికి బావ లేని సంభందము చెయ్యాలి . అలా గానీ జ్యేష్టులకు ఇచ్చి వివాహము చెయ్య కూడదు .


అలాగే విశాఖ నక్షత్రములో పుట్టిన వారికి చివరి సంతానముగా జన్మించిన వారికి ఇచ్చి వివాహము జరిపించాలి . ఇది ముఖ్యముగా పురుషుల విషయములో ఆచరించాలి .                         

2013-07-26

గోచారము – గురుడు


గోచారములో గురుడు పన్నెండు రాశులలో  సంచరించునపుడు కలుగు ఫలితములు

శ్లోకం :   రాజకోపో యశోహానీ రుద్యోగస్య విరోధకం
          బుద్ధిభ్రంశో భాగ్యహాని ర్భయంతను గతే గురౌ
జన్మ రాశిలో గురుడు సంచరించు నపుడు ప్రభుత్వ అధికారుల కోపమునకు గురియగుదురు . పేరు ప్రఖ్యాతలకు నష్టము కలుగును . చేయు వృత్తి , వ్యాపారములలో ఇబ్బందులు ఎదురగును . బుద్ది గతి తప్పును . సంపద నశించును . భయముగా ఉండును .

శ్లోకం :   మనస్సౌఖ్యం యశోవృద్ధి స్సౌభాగ్యంచ ధనాగమః
          ధర్మ వ్యయం మనస్సౌఖ్యం ద్వితీయ స్తానగేగురౌ
రెండవ రాశిలో గురు సంచార వేళలో మనస్సున సౌఖ్యము కలుగును , గృహమునందు శుభ కార్యములు జరుగును . కీర్తి ప్రతిష్టలు పెరుగును . ధన రాబడి బాగుంటుంది . తీర్ధ యాత్రలు చేయడము , ధర్మ బద్దమైన కార్య క్రమములలో పాల్గొనడము జరుగుతుంది . సంతోషముగా ఉంటుంది . కుటుంబ సౌఖ్యము కలుగును .

శ్లోకం :   అతిక్లేశం బంధువైరం దారిద్యం దేహపీడనం
          ఉద్యోగ భంగం కలహం తృతీయ స్తానగే గురు:
మూడవ రాశిలో గురుడు సంచారము చేయు చున్నప్పుడు శారీరక శ్రమ అధికము గా ఉంటుంది . చుట్టములతో విరోధము ఏర్పడుతుంది .దరిద్రమును అనుభవిస్తారు. ఉద్యోగ వ్యాపారములలో నష్టములు కలుగుతాయి . శరీరమునందు భాధలు , అనవసరమైన తగవులు ఏర్పడతాయి .

శ్లోకం :   యాచనం బుద్ది చాంచల్యం తేజో హానీం ధన వ్యయం
          దేశ త్యాగంచ కలహం చతుర్ధ స్తానగే గురు:
నాలుగవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు దీన స్థితి కలుగుతుంది . బుద్ది చంచలముగా ఉండును. మర్యాద నశించును . ధన నష్టము కలుగును గొడవలు పెరుగుతాయి . స్థాన నాశనము కలుగుతుంది


శ్లోకం :   అర్ధ లాభం తదైశ్వర్యం స్వకర్మ రతి హర్షితం
          సదా స్వజన సౌఖ్యంచ పంచమస్థే భావే ద్గురౌ
అయిదవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు ధన లాభము కల్గుతుంది . స్వయముగా చేపట్టిన పనులు అనుకూలించుటయే కాక విజయము లభించును తన కుటుంబ మరియు బంధు వర్గముల వలన సౌఖ్యమును అనుభవిస్తారు .

శ్లోకం :   దారాపుత్ర విరోధశ్చ స్వజనై కలహస్తదా
          చోరాగ్ని నృప భీతిశ్చ షష్టమస్తే భవేద్గురౌ
బృహస్పతి ఆరవ రాశి సంచారము లో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితోనూ , పిల్లలతోనూ విరోధము ఏర్పడును . అసహనము కలుగును , దొంగల వలన నష్టము ఏర్పడును . అగ్ని భయము కలుగును . ప్రభుత్వ సంభందిత వ్యవహారములలో ఇబ్బందులు కలుగును .

శ్లోకం :   రాజ దర్శన మారోగ్యం గాంభీర్యం గాత్రపోషణం
          అభీష్ట కార్య సిద్దిశ్చ సప్తమస్తే భవేద్గురౌ
ఏడవ రాశిలో గురుని సంచారము జరుగు చున్నప్పుడు మంచి ఆరోగ్యముగా ఉంటారు . ప్రభుత్వ పరిపాలకుల తో పరిచయములు ఏర్పడతాయి . తలచిన కార్యములు నెరవేరుతాయి . ప్రతి పని తనకు అనుకూలముగా జరుగుతుంది .

శ్లోకం :   చోరాగ్ని నృప భీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం
          నిష్టురం సాహసం క్రోధం అష్టమస్తే గురౌ భవేత్
ఎనిమిదవ రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు దొంగల వలన గానీ , అగ్ని వలన గానీ , నష్టము ఏర్పడును , శరీర సౌఖ్యము ఉండదు . నిస్టూరముగా మాట లాడడం , ప్రతి పనిలోనూ తెగింపు , కోపము ఎక్కువగా ఉండడము జరుగుతుంది .

శ్లోకం :   అర్ధంచ స్వకులాచారః గృహలాభః సుభోజనం
          నిత్య స్త్రీ జన సంపర్కం నవమస్తే భవేత్ గురౌ
తొమ్మిదవ రాశిలో గురుని సంచారము ఉన్నప్పుడు సునాయాస ధన లాభము కలుగును . మంచి ఆచార సాంప్రదాయముల ప్రకారము నడచుకొంటారు. గృహము నిర్మించుకొంటారు . ఇరుగు పొరుగు వారితో కలసి మెలసి ఉంటారు . భార్య భర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది .

శ్లోకం :   ధాన్య నాశో ధనచ్చేదః వృధా సంచరణం భయం
          స్వజనై దూషనః చైవ దశమష్తో యదా గురు:
బృహస్పతి పదవ రాశిలో సంచరించు చున్నప్పుడు ధనమునకు నాశనము కలుగును , అనవసర ఖర్చులు పెరుగుతాయి . బ్రతుకు భయముగా సాగుతుంది . ఇతరులచే దూషించ బడతారు .

శ్లోకం :   యశో వృద్ధి బలం తేజ స్సర్వత్ర విజయ స్సుఖం
          శత్రు నాశో మంత్రం సిద్ధి రేకాదశ గతే గురౌ
పదకొండవ రాశి లో గురుడు సంచారము  చేయుచున్నప్పుడు మంచి పేరును సంపాదిస్తారు . తేజస్సు , పలుకుబడి పెరుగుతుంది . శత్రువులు నాశనమవుతారు ,అన్నివిధాలా లాభమును పొందుతారు .

శ్లోకం :   శుభ మూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ దూషణం
          స్థాన భ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్తానగే గురౌ
పన్నెండవ రాశిలో గురుడు సంచారము జరిగేటప్పుడు ఇంటిలో శుభ కార్యములు జరుపుట వలన ధనము ఖర్చగును . ఆస్తులను అమ్ముకొంటారు . దరిద్రమును అనుభవించుట , స్థానమును మారుట మొదలగు ఫలితములను కలుగచేయును.  

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...