2013-07-03

చంద్రుని కధ



యువకుడు , చురుకైన వాడు , సకల శాస్త్రములు తెలిసిన వాడు, నిత్యము పరి పూర్ణుడై వెలుగొందువాడు . ఉత్సాహవంతుడు .చంద్రుడు

దక్ష ప్రజాపతికి అశ్విని నుండి రేవతి వరకుగల నక్షత్రముల పేర్లు గల 27 గురు కుమార్తెలు .ఉండేవారు .ముగ్ధ మనోహర రూపుడైన చంద్రునికి దక్షుడు తన ఇరవై ఏడుగురు కుమార్తెలనిచ్చి వివాహము చేసాడు .రోజుకొక నక్షత్ర నామము గల స్త్రీతో కాపురము చేయమని ఆజ్ఞాపించాడు . ఆ విధముగా చంద్రుడు రోజుకొక స్త్రీతో కాపురము చేస్తూ ఉండేవాడు .

కాల క్రమేణా ఈ ఇరవై ఏడుగురు లో రోహిణి అను నామము గల స్త్రీ పట్ల చంద్రునికి విపరీతమైన ప్రేమ పెరిగింది  . అతి ప్రియమైనది .ఆమె పట్ల ఉన్న ప్రేమ చేత రోహిణి దగ్గర ఎక్కువ కాలం  గడిపేవాడు .  ఇది చూచిన మిగిలిన భార్యలు అలిగి దక్ష ప్రజాపతి ఇంటికి వచ్చేసారు .

కుమార్తెలు ముభావంగా ఉండేవారు . అది గమనించిన తల్లి విషయమేమిటని అడిగింది .అంతట కుమార్తెలు తమ భర్త రోహిణి దగ్గర ఎక్కువ కాలం ఉంటున్నాడనీ , తమను పట్టించు కోవడం లేదనీ , తమతో కాపురము చేయడం లేదనీ తల్లితో భాదను చెప్పుకొని ఏడవసాగారు. తల్లి కుమార్తెలను ఓదార్చింది . విషయమును భర్తయైన దక్షునికి తెలియ పరచింది . దక్షుడు కుమార్తెలను సముదాయించి ఓదార్చాడు . చంద్రునికి పిలుపు పంపాడు .

చంద్రుడు వచ్చిన తరువాత విషయమును తెలియపరచి సమాధానమేమిటని అడిగాడు . దానికి చంద్రుడు జవాబివ్వలేదు . మామగారైన  దక్షుడు రెట్టించాడు . వెంటనే చంద్రుడు నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను . అడగడానికి మీరెవరు ? అని ఎదిరించాడు . అహంకారముతో ప్రవర్తించుచున్నావు . నా అంత శక్తిమంతుడు లేడని గర్వ పడుచున్నావు. ఇది నీకు తగదు. భార్యలందరి పట్ల సమాన దృష్టి ఉండాలి అని హితబోధ చేశాడు . ఎంతకీ చంద్రుడు మాట వినలేదు .. అంతట దక్షుడు కోపముతో పరి పూర్ణ కళలు కలవాడననే అహంకారం నీలో ఉన్నది . కావున ప్రతిరోజూ రోజుకొక కళ చొప్పున నీలో నశించి పోతుంది . ప్రతి నెలకు ఒక సారి పూర్తిగా క్షీణత్వము పొందుతావు అని శపించాడు .

అంతట కుమార్తె లందరూ తండ్రిని వేడుకొన్నారు . మీరిచ్చిన శాపము వలన చంద్రుడు పూర్తిగా బలము లేని వాడవుతాడనీ శాప విమోచన తెలుపమనీ కోరారు .అంతట దక్షుడు శాపాన్ని సవరించాడు . క్షీణత్వము పొందిన నాటినుండి రోజుకొక కళ చొప్పున పెరుగుతూ పదిహేను రోజులకు పరి పూర్ణుడవుతాడనీ , పరిపూర్ణుడయిన నాటినుండి రోజుకొక కళ తగ్గుతూ తిరిగి పదిహేను రోజులకు బలహీనుడవుతాడనీ చెప్పాడు .
ఈ శాప ప్రభావము వలన ఏర్పడేవే  అమావాస్య , పూర్ణిమ .

ఇది కధ మాత్రమే . బ్లాగు మిత్రులు గమనించ గలరు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...