2013-07-02

చంద్రుని కుమారుడు -బుధుడు



బుధుని గురించి దేవీ పురాణములో ఒక కధ ఉన్నది .
ఈ పురాణములో చంద్రుని కుమారుడు బుధుడని చెప్పితిరి .  
దేవతల గురువు బృహస్పతి . అతని భార్య పేరు తార . ఈమె నవ యవ్వన సౌందర్యవతి . దేవ నర్తకీమణులు అయిన రంభా , ఊర్వశి , మేనక , తిలోత్తమ లను మించిన అందగత్తె .

బృహస్పతి వయో వృద్ధుడు , ముదుసలి . తారకు  ఆయన పట్ల ఇష్టము ఉండేది కాదు .
బృహస్పతి శిష్యగణములో దేవతలలో ఒకడైన చంద్రుడు కూడా ఉన్నాడు . చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు . సకల కళలు తెలిసిన వాడు .యువకుడు ,అందగాడు . చూడముచ్చటైన రూపము కలవాడు. బృహస్పతి భార్య తారాదేవికి  ఇతని పై మనసు పడింది . అతనిని ప్రేమించసాగింది  . కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య సంబంధము ఏర్పడింది . తార చంద్రుని విడచి ఉండలేక బృహస్పతిని వదలి చంద్రుని వెంట అతని ఇంటికి వెళ్లిపోయింది .

భార్య చంద్రునితో వెళ్లి పోయిందనీ తెలుకున్న బృహస్పతి పరువు పోతుందని భావించి ఒకరిద్దరిని చంద్రుని ఇంటికి రాయబారమునకు పంపాడు . కానీ చంద్రుడు మాట వినలేదు . ఆనోటా ఈ నోటా అందరికి తెలిసింది . చివరకు తగవు దేవేంద్రుని వద్దకు చేరింది . దేవసభలో పెద్దలందరూ ఆశీనులై ఉన్నారు . చంద్రుని , తారను సభకు రమ్మని దేవ భటులతో వర్తమానము పంపారు . చంద్రుడు తారను వెంటబెట్టుకొని సభకు వచ్చాడు .

గురుభార్య తల్లితో సమానము కదా? ఇంతటి అకృత్యానికి పాల్పడతావా  అని దేవేంద్రుడు చంద్రుని ప్రశ్నించాడు.
అంతట చంద్రుడు కోరి వచ్చిన స్త్రీ ని కాదనుట ధర్మశాస్త్ర విరుద్ధము కదా అని జవాబిచ్చాడు . మాటా మాటా పెరిగింది. చివరకు దేవేంద్రుని కూడా ఎదిరించి అలనాడు నీవు అహల్య పై చేసిన ఘన కార్య మేమిటని ప్రశ్నించాడు .
మిగతా పెద్దలు జోక్యము చేసుకొని ఇద్దరినీ వారించారు . మరి ఈ సమస్యకు పరిష్కారము ఏమిటి అని చంద్రుని అడిగారు .. చంద్రుడు ఇలా అన్నాడు . తారకు ఇష్టమై వచ్చింది . తాను వెల్లిపోతానంటే నేను అడ్డు చెప్పను.

దేవతలందరికి పూజ్యుడైన బృహస్పతిని పెళ్ళాడి ఇంతటి ఘోరమునకు పాల్పడుట నీకు తగునా ?అని పెద్దలందరూ తారను మందలించారు .  దానికి తార మౌనంగా ఉన్నది . తారకు నచ్చజెప్పి బృహస్పతి ఇంటికి పంపించారు ..

కొన్నాళ్ళకు ఆమె ఒక బిడ్డను ప్రసవించింది . బిడ్డకు బుధుడు అని నామకరణము చేసారు .. కొన్ని సంవత్సరముల తరువాత బుధునకు శాస్త్రోక్తముగా ఉపనయనము చేసే సమయములో బుధుడు నా కుమారుడనీ బృహస్పతి , కాదు నా కుమారుడని చంద్రుడు ఇద్దరి మధ్య వాగ్వాదము జరిగింది . మరలా దేవ సభకు విషయము చేరింది . సభా స్థలిలో ఉన్న పెద్దలెవరూ ఈ సమస్యను పరిష్కరించ లేకపోవుచున్నారు .

తారకు కబురు పంపారు. అంతట తార సభకు వచ్చింది . సభకు వచ్చిన తారతో పెద్దలందరూ చెప్పుచున్నారు . అలనాడు నీవుచేసిన తప్పిదము వలన ఈ సమస్య ఏర్పడినది . ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారము దొరకలేదు . దీనికి సమాధానము ఏమిటి అని అడుగగా నేను చంద్రుని వద్ద ఉన్నప్పుడే గర్భము ధరించినాననీ . బుధుడు చంద్రుని కుమారుడే అని తార దేవి చెప్పినది .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...