2014-05-06

మూర్తి నిర్ణయం చేయడం ఎలా ?

గ్రహములు నిత్యమూ పరి భ్రమణము చెందుతూనే ఉంటాయి .
ప్రతి గ్రహము తన కక్ష్య ను అనుసరించి ముందుకు కదులుతూ ఉంటుంది . అలా గ్రహములు ఒకరాశినుండి మరొక రాశిలోకి ప్రవేశించు సమయమును తెలుసుకొని మూర్తి నిర్ణయము చేయబడుతుంది .
ప్రతి సంవత్సరము మనం రాశీ ఫలితములను తెలుసుకోవడం అనేది అనాదిగా వస్తున్నా ఆచారము . దీనికి ప్రత్యేకించి  ఒక సమయాన్ని నిర్ణయించడం జరిగింది .

మన తెలుగు వారు ముఖ్యముగా ఉగాది నుండి సంవత్సరము ప్రారంభము అయినట్లుగా భావించి రాశీఫలితములను తెలుసుకోవడం జరుగుతుంది . ఉగాది సమయములో ఉన్న గ్రహముల స్థితి ప్రకారము మాత్రమే సంవత్సర ఫలితములు ఆధారపడి ఉండవు . గ్రహములలో నిత్యమూ జరుగు సంచారమును బట్టి మానవునకు కలుగు శుభ, అశుభములు ఆధారపడి ఉంటాయి . వీటిని సూక్ష్మముగా తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని మూర్తుల నిర్ణయము చేయడం జరిగింది .
ఏ ఏ మూర్తుల వలన ఏవిధమైన ఫలితములు కలుగుతాయి అను విషయములను మనం ఇంతకూ ముందర శీర్షికలలో తెలుసు కున్నాం .
ఇప్పుడు ఈ మూర్తులను ఎలా నిర్ణయించాలి అను విషయములను తెలుసుకుందాం .
చద్రుని గమనము వలన నక్షత్రములను తెలుసుకోవడం జరుగుతుంది . మనకు మన జన్మ నక్షత్రము తెలిస్తే జన్మరాశి తెలుస్తుంది . జన్మ నక్షత్రము తెలియని వారికి పేరు లో ఉన్న మొదటి అక్షరమును బట్టి నక్షత్రము తెలుసుకోవచ్చు . ఆ విధముగా పేరులో ఉన్న మొదటి అక్షరము ప్రకారము ఏ నక్షత్రము అవుతుందో గుర్తించి , ఆ నక్షత్రము ఏ రాశికి చెందినదో తెలుసు కొనుట చాలా సులభము

మీ పేరులోని మొదటి అక్షరము ప్రకారము మీది ఏ నక్షత్రము ఏ రాశి అను విషయము తెలుసు కోవాలంటే ఈ దిగువన ఉన్న లింకును క్లిక్ చెయ్యండి .

జన్మ లేక నామ నక్షత్రము తెలుసుకున్న తరువాత జన్మరాశిని  లేక నామ రాశిని తెలుసుకోవాలి .
ఏ గ్రహమునకు మూర్తి నిర్ణయము చేయవలెనో మొదట గుర్తించాలి . పిమ్మట ఆ గ్రహము ఏ రోజున ప్రవేశించు చున్నది . గ్రహము ప్రవేశించు రోజున ఉన్న నిత్య నక్షత్రము ఏమిటి ? ఆ నక్షత్రమునకు సంభందించిన రాశి ఏమిటి అను విషయమును జాగ్రత్తగా లెక్కించ వలెను . ఆ విధముగా లిక్కింపగా వచ్చిన రాశి సంఖ్యను బట్టి మూర్తి నిర్ణయము చేయాలి .
జన్మరాశి లేక నామ రాశి నుండి
1  6    11  రాశులలో ఉన్న గ్రహములు సువర్ణ మూర్తులు
2  5    9  రాశులలో ఉన్న గ్రహములు రజిత ( వెండి ) మూర్తులు.
3   7   10  రాశులలో ఉన్న గ్రహములు తామ్ర ( రాగి ) మూర్తులు
4   8   12   రాశులలో ఉన్న గ్రహములు లోహ ( ఇనుము ) మూర్తులు


ఈ విధముగా మూర్తి నిర్ణయము చేయాలి . పంచ లోహాలలో వాటికి ఉన్న విలువను ఆధారముగా చేసుకొని గ్రహములు ఇచ్చు శుభ ఫలితములను తెలుసుకొనుటకు వీలుగా ఉంటుందని ఈ మూర్తి నిర్ణయము చేయడం జరిగింది .

2014-05-05

వధూ వరుల రాశులు


వధూ వరులకు వివాహము చేయ నిశ్చయించి నపుడు షష్ఠ అష్టకములు , ద్విర్ద్వాదశములు లేకుండా చూడ వలెనని జ్యోతిర్విదులచే చెప్ప బడినది .
ద్విర్ద్వాదాశము వలన అంతగా చెడు ప్రభావము కనిపించుట లేదు . కావున వధూ వరుల ఇరువురి రాశులు ద్విర్ద్వాశము అయినప్పటికీ వివాహము చేయ వచ్చును .
షష్ఠ అష్టకములు అయినపుడు కూడా చేయ వచ్చునా అను సందేహము కలుగుతుంది .
కొన్ని రాశుల విషయములో షష్ఠ అష్టకములు అయినప్పటికినీ వివాహము చేయవచ్చు .

షష్ఠ అష్టకములు మూడు రకములుగా ఉన్నవి .
1 సమ షష్ఠ అష్టకములు 2 . మిత్ర షష్ఠ అష్టకములు ౩. శత్రు షష్ఠ అష్టకములు .

1,. సమ షష్ఠ అష్టకములు అనగా ఒకే గ్రహము ఆధిపత్యము వహించు రాశులని తెలుసుకోవాలి.
సమ షష్ఠ అష్టక రాశులలో పుట్టిన వారికి నిస్సందేహముగా వివాహము జరిపించవచ్చు .
ఉదా : వృషభ , తుల రాశులలో జన్మించిన వారికి వివాహము చేయవచ్చు .  ఈ రాశులకు శుక్ర గ్రహము అధిపతి .
మేష , వృశ్చిక రాశుల లో పుట్టిన వారికి వివాహము చేయవచ్చు . ఈ రాశులు రెంటికి కుజుడే అధిపతి .

2. మిత్ర షష్ఠ అష్టకములు అనగా ఒక రాశి కి చెందిన అధిపతి అయిన గ్రహమునకు మరొక రాశికి చెందిన అధిపతి అయిన గ్రహము మిత్రుడై ఉండాలి . ఆ విధముగా రెండు రాశుల మధ్య మిత్రత్వము కలిగియున్న రాశులను మిత్ర రాశులని అందురు .
ఉదా : కర్కాటక ధనుస్సు , సింహం మీనం , కన్య కుంభం , మిధునం మకరం ఈ రాశుల కు అధిపతులైన గ్రహములు పరస్పరము ఒకరికొకరు మిత్రులై ఉండుట వలన దంపతుల మధ్య కొంత అన్యోన్యత లోపము ఉన్నప్పటికినీ ఒకరిని ఒకరు అర్ధం చేసుకుని సుఖముగా జీవింతురు .

౩. శత్రు షష్ఠ అష్టకములు . ఈ రకమైన రాశులకు చెందిన వారికి ఎట్టి పరిస్థితులలోనూ వివాహము చేయరాదు .

ఉదా : మేషం కన్య , తుల మీనం , వృషభం ధనుస్సు , మిధునం వృశ్చికం , కర్కాటక కుంభం , సింహం మకరం ఈ జంటలకు వివాహము జరిపించుట వలన సంసారమున అనేక ఇబ్బందులు కలుగుటయే కాక  పరస్పరము ఒకరికొకరు దూషించు కొందురు . వీరిలో చాలా మందికి విడాకులు తీసుకొనుట కూడా జరుగును .

కావున వివాహము నిశ్చయించు నపుడు అనేక విధములుగా ఆలోచించి పై విషయములన్ని క్షుణ్ణంగా పరిశీలించుట మంచిది .

2014-03-12

మూర్తుల ప్రభావము

ఏ జాతకునకైనా ఫలితములను గురించి తెలుసు కోవాలని అనుకొన్నప్పుడు రెండు విధముల అనాలసిస్ అవసరం అవుతుంది .

అది ఒకటి గ్రహచారము , రెండవది గోచారము
గ్రహచారము అనగా మనం పుట్టినప్పుడు ఉన్న గ్రహముల స్థితి ఆధారముగా గ్రహములు పొందిన రాశి యొక్క స్వభావమును అనుసరించి గ్రహ దశలను తెలుసుకొని జన్మ లగ్నము లగాయితూ గ్రహములు పొందిన  ఆధిపత్యము ననుసరించి ఆయా గ్రహముల బలాబలములను  ఫలితములను తెలుసు కోవడం.

ఇక రెండవది గోచారము ఈ విధానములో వర్తమాన పరిస్థితులలో గ్రహముల గతిని అనుసరించి కలుగు మార్పులకు అనుగుణముగా మానవ జీవితముపై కలుగు  శుభ ,అశుభ ఫలితములను క్షున్నముగా తెలుసుకొనుటకు ఉపయోగ పడుతుంది .  గోచారము ప్రకారము గ్రహములకు ఫలితములను తెలుసుకోవాలని అనుకొన్నప్పుడు జన్మ లగ్నమును ప్రామాణికముగా తీసుకోకూడదు . ఇక్కడ జన్మ రాశి  మాత్రమే పరిగణన లో తీసుకోవాలి . ఎవరైనా ఒక వ్యక్తి యొక్క గోచారము ఫలితమును సులభంగా తెలుకోవడానికి మహర్షులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసినారు . ఈ మూర్తులను లోహములతో పోల్చి చూపారు .

పంచ లోహాలలో బంగారము , వెండి , రాగి , ఇత్తడి  , ఇనుము . ఇవి ఒకదానికన్న ఒకటి తక్కువ విలువ కలవి . ఉదా : బంగారము చాలా విలువ కలిగినది దానికన్నా వెండి తక్కువ విలువ దానికన్నా రాగి , దానికనా ఇత్తడి , దానికన్నా ఇనుము ఇలా విలువ తగ్గి పోతుంది .

ఈ లోహాలకున్న విలువలకు అనుగుణముగా సాధారణ మానవునకు కూడా సులభంగా అర్ధం అవుతుందనే ఉద్దేశ్యంతో మన పూర్వీకులు గ్రహములకు మూర్తి నిర్ణయము చేసారు .

1 సువర్ణమూర్తి (బంగారము )2 రజిత మూర్తి( వెండి )3 తామ్ర మూర్తి (రాగి ) 4 లోహ మూర్తి (ఇనుము 0 

సువర్ణ మూర్తి 100 %  శుభ ఫలితములను
 రజిత మూర్తి 75% శుభ ఫలితములను
తామ్ర మూర్తి 50% శుభ ఫలితములను
లోహ మూర్తి  25% శుభ ఫలితములను ఇచ్చును . ఈ గ్రహములకున్న మూర్తి ప్రభావము ప్రకారము   .

మూర్తి నిర్ణయము ఎలా చెయ్యాలి అనే విషయములను తదుపరి శీర్షికలో తెలుసు కుందాం .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...