2013-06-29

మేషలగ్నము – శుక్రుడు 7 -12

మేష లగ్నములో జన్మించిన వారికి సప్తమ స్థానములో  శుక్రుడున్న తమ కుటుంబము కన్నా అత్తగారి కుటుంబము స్థితి మంతులై ఉంటారు . వీరు జీవిత భాగస్వామి మాటకు విధేయులై ఉంటారు. మంచి ఆనంద మయ దాంపత్య జీవితమును అనుభవిస్తారు. ఇక్కడ శుక్రుడు కేంద్ర స్థితిని పొంది స్వక్షేత్ర స్థితిలో ఉండుట వలన మాలవ్య మహాపురుష యోగము ఏర్పడుచున్నది . జాతకులకు శుక్ర మహాదశ వివాహ అనంతరము వస్తే చాలా గొప్ప స్థితికి చేరుకొంటారు .

అష్టమ స్థాన శుక్ర స్థితి యున్న జాతకులు స్త్రీ మూలకముగా కష్టములు ఎదుర్కొంటారు . వీరికి భాగస్వామ్య వ్యాపారములు గానీ , ఇతర వ్యవహారములు గానీ పనికి రావు . ఏదైనా స్వంతంత్రము గా ఆలోచించి చేసుకోవాలి .తప్ప ఇతరుల సలహాలు సూచనలపై నడచుట మంచిది కాదు . భార్య మాటకు విలువ నివ్వరు . భార్య భర్త ఇరువురు ఒకరినొకరు దూషించుకొను స్వభావము ఉంటుంది .

భాగ్య స్థానము అనగా తొమ్మిదవ ఇంట శుక్రుడున్న జాతకులు వివాహము వలన లాభ పడతారు . పురుషుల  కైతే భార్య ఉన్నత స్థాయి కలిగిన కుటుంబము నుండి వస్తుంది . స్త్రీలకు  అయితే ఆమె మెట్టినింట అనగా అత్త వారింట అడుగు పెట్టిన నాటి నుండి ఐశ్వర్యముతో తులతూగుతారు . సామాన్య కుటుంబము పుట్టిననూ ఇట్టి శుక్ర స్థితి కలిగిని అమ్మాయిని పెండ్లి చేసుకున్న వారింట ధనలక్ష్మి తాండవ మాడుతుంది .
రాజ్య స్థానము అనగా పదవ ఇంట శుక్ర స్థితి కలిగిన జాతకులకు భాగస్వామ్య వ్యవహారముల వలన , స్త్రీలవలన జీవితము స్థిర పడుతుంది . సాధారణము గా వీరికి అత్తగారి కుటుంబ ప్రోత్సాహం ఉంటుంది . భార్య సలహాలను పాటించుట మంచిది . 

లాభ స్థానము లో శుక్రుడు ఉన్న జాతకులకు స్త్రీ మూలకముగా అనేక లాభములు కలుగుతాయి . భాగస్వామ్య వ్యవహారముల యందు బాగా కలసి వస్తుంది . భార్య , భర్త ఇద్దరూ సంపాదనా పరులై ఉంటారు . అట్లు లేకున్నా వివాహము జరిగిన నాటి నుండి ఉన్నతమైన అభివృద్ది కలుగుతుంది .

పన్నెండవ ఇంట శుక్రుడున్న జాతకులు స్త్రీల మూలకముగా ధన నాశనము కలుగుతుంది . విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేస్తారు . ధనము యొక్క విలువ తెలియక విచ్చల విడిగా ఖర్చు చేయుటయే కాక ఆర్ధిక ఇబ్బందులను కొని తెచ్చుకొంటారు . గతములో ఉన్న ఆస్తులను పాడు చేస్తారు . స్త్రీ లోలత్వము కలిగినవారు . వీరు ఆర్ధిక వ్యవహారములను తాము స్వయముగా నిర్వహించుట మంచిదికాదు .ప్రేమ కార్య కలాపములు ఉంటాయి .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...